ఉపనిషత్తులకు సజీవ భాష్యం, అవతారవరిష్ఠులు అయిన శ్రీరామకృష్ణులవారి ముఖతాజాలువారిన అమృతకలశమే ఈ కథామృత గ్రంథం. ఆధునిక మానవుడు ఆధ్యాత్మిక విలువలపట్ల విముఖత కల్గి ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితం యొక్క ఆవశ్యకతను గుర్తించలేకున్నాడు. ఫలితంగా నిరంతర ఒత్తిడికి లోనై, దుర్భరమైన వేదనతో జీవితంతో రాజీపడలేక, సతమతమవుతున్నాడు. నిజమైన ఆనందం, ప్రశాంతత ఆధ్యాత్మిక జీవనంలోనే లభిస్తుందని మార్గనిర్దేశం చేస్తుంది ఈ గ్రంథం. కాలానికి, జనుల అవసరాలకు తగిన విధంగా బోధ చేయడమే ఈ కథామృత వైశిష్ట్యం. క్లిష్టమైన ఆధ్యాత్మిక సత్యాలు చాలా సరళంగా, హాస్యోక్తులతో కూడుకొని, చక్కని దృష్టాంతాలతో, చిన్న చిన్న కథలతో, ఉపమానాలతో, తేలికగా అర్థమయ్యే భావజాలంతో, మనస్సుకు హత్తుకునేలా ఉండడమే ఈ గ్రంథం ప్రత్యేకత. ఈ గ్రంథం ఒక మతానికి చెందినదిగా కాక యావత్‌ మానవజాతికి సంబంధించిన విశ్వవేదంగా విరాజిల్లుతోంది. ముఖ్యంగా కథామృత రచయిత అయిన ‘మ‘  శ్రీరామకృష్ణుల దివ్య ముఖారవిందం నుండి వెలువడిన వాక్కులు ఒకింత కూడా వదలరాదనే భావనతో ఎంతో శ్రద్ధగా ఒక్కొక్క దృశ్యాన్ని వేయిసార్లయినా ధ్యానించి ఈ అద్భుత రచన చేశారు. శ్రీరామకృష్ణులవారు పాడిన పాటలు, నరేంద్రుడు మొదలైనవారు పాడినప్పుడు వారు పొందిన భావసమాధి స్థితులు మనల్ని సంభ్రమాశ్చర్యాలలో ఓలలాడించి శ్రీరామకృష్ణుల వారి కాలానికి మనలను తీసుకువెళతాయనడంలో ఎలాంటి సందేహమూలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *